Friday 5 April 2024

పొడిబారిన ముద్దు..



కొన్నాళ్ళుగా నీ ముద్దు
పెదవుల్ని అంటడం లేదు..
తడారిపోయింది
చప్పగా.. జీవం లేనట్లుగా..
మారిపోతుంది నిజం నుంచి జ్ఞాపకంలా
ఈ ముద్దే తరుముతోంది
పెదాలను మెలితిప్పుతూ.. నాలుకతో
స్నేహం చేస్తావు చూడు అదే ముద్దు
నన్ను వెక్కిరిస్తుంది.
వెచ్చని నీటి ఆవిరిలా అలముకుంటూ
అదే ఊహ..
దూరంగా జరిగిపోతున్న జ్ఞాపకాలతో
తెంపుకోలేని సంకెల ఈ ముద్దు
గాఢంగా హత్తుకుంటూ
పెదాలతో ప్రేమను బట్వాడా
చేస్తావు చూడు,, అదే ముద్దు
కదిలిపోతున్న ఆలోచనల్లా
గుండెల్లో గుబులు పుట్టిస్తో
వడపోతల రాపిడితో
ముద్దు చుట్టూనే ఆలోచన
ఎంత తెంపినా తెగని రొదలా
కాలంతో పోటీపడి పొడిబారిపోతోంది.

Thursday 4 April 2024

మంకెన్నలందం..4-4-2024


ప్రేమిస్తాను ఎప్పటికీ.. 
నిదురతో వాలిపోయే కళ్లను నిటారుగా చేసి,  
రాధామాధవాలంత మనోహరంగా నీరాక కోసం చూస్తాను..

ఆరు బయట సాయంత్రాలు విచ్చుకునే
చంద్రకాంతలనడుగు
గుమ్మనికి నా కళ్లను అప్పగించేసిన తీరు

చీకటి వేళకు విచ్చుకునే సన్నజాజులో..
సువాసనేస్తూ, వాకిలంతా పరుచుకుంటూ
నా ఎదురుచూపును వెక్కిరిస్తుంటాయి..

మరి మల్లెలో ప్రియుని రాకలో విరహాన్ని 
రాతిరికి అప్పగిస్తాయి.
నిదురలో నువ్విచ్చే ముద్దు 
గులాబీలను హత్తుకున్నట్టు..

చల్లని గాలిలో, జోరు వానలో, ప్రతికాలంలో
నాతో నువ్వుండే సమయాలు చాలవూ.. పూల సొగసులా..
జీవిత సౌకుమార్యాన్ని ఆస్వాదించేందుకు..

ఈ తడిపొడి సుఖ దుఃఖాలకేం తెలుసు
నీ కోపంలో, ప్రేమలో దాగిన మంకెన్నలందం..

Wednesday 3 April 2024

ఈ నవ్వుకు చిరునామా తెలుసా..


ఈ చిరునవ్వు ఈ పెదవుల మీద పూసి చాలా కాలమైంది..
అరుగులు పట్టుకుని పరుగు తీసామే అప్పుడు 
మైళ్ళ లెక్క తెలియని నాటికీ నువ్వు..

ఆయాసం ఆటగా ఉన్ననాడు
నీ కాలి వేగానికి, ఆయాసాన్ని జత చేసి పరుగందుకున్న నాడు
నీతో ఉప్పల గుప్ప ఆడిన నాటిదీ నవ్వు

పవిటేసిననాడు నీ చిరునామాను వెతికింది.
వచ్చి చేరే అందాలకు 
నువ్వు చిరునామా అవుతావని ఆశించింది.

జీవిత కెరటాల్లో కొట్టుకుపోయినా,
నీ సాక్షిగా ఆనాటి నవ్వు పూస్తూనే ఉంది.
ఎప్పుడో ఆదమరపుగా నీ ఆలోచనలా
అకాల వర్షంలా, గాలి కెరటంలా
నీ జ్ఞాపకంగా నవ్వు..

మళ్లీ ఇదిగో మనసంతా పూస్తూ, 
నవ్వి నవ్వి పెదవులు చిట్లేంతగా నవ్వు

చిరుమందహాసం కాదు.. చిద్విలాసం.
కడుపుబ్బా నవ్వే నవ్వది.. అప్పట్లానే అలానే అచ్చం
బాల్యం పేజీల్లో మిగిలి గురుతుకొచ్చే చిన్ననాటి 
అమాయకపు నవ్వు..పూస్తూనే ఉంది ప్రతిరోజూ
నీ ముఖ మంత అందంగా..
నీ పలువరసంత చక్కగా
తీయగా...

Tuesday 2 April 2024

మార్పు సహజం.. 2-4-2024


శ్రీశాంతి మెహెర్

కాలంతో కొట్టుకుపోతూ మార్పుకు మార్పు చెందుతూ ఉండటం అనేది మనిషికే కాదు, ప్రకృతికీ కొత్తేం కాదు. కొన్ని నిర్ణయాలు మనిషిని ఆలోచించేలా చేస్తాయి. కొన్ని అనుసరించేలా చేస్తాయి. కాలానికి తగినట్టుగా మారడం అలవాటు పడటం పుట్టుకతోనే వచ్చి చేరుతుంది. అలా కాలంతో పాటు మనం కూడా సాగిపోతూ ఉంటాం. కొత్తకు అలవాటు పడటానికి కాస్త టైం తీసుకుంటాం ఏమో కానీ.. నెమ్మదిగా అలవాటు పడిపోతాం. కొత్త వింతగా, విడ్డూరంగా అనిపిస్తుంది. ఇదంతా ఎందుకంటే.. 

నిన్న ఆకాశాన్ని పరుచుకుని ఉన్న ఆ చెట్టు కొమ్మలు ఈరోజు బోసితనాన్ని నింపుకున్నాయి. అదీ అలవాటు పడేందుకే.. నెమ్మదిగా ఆ బోసితనం అలవాటుగా మారిపోయింది. మునుపు ఉన్న ఖాళీ ఎందుకో ఇప్పుడు కొత్తగా అనిపించడంలేదు. జీవితం కూడా అంతే.. నిండుగా అనిపించిన దానికి, అలవాటు పడి కాసిన్ని రోజులు గుండె వెలితితో కొట్టుకున్న దానికి పెద్ద తేడా అనిపించదు.  నెమ్మదిగా అలవాటుగా సర్దుకుంటుంది. 

మనుషులూ అంతే మనసంతా నిండిపోతారు. మరో ఆలోచనరానీయనంతగా కలిసిపోతారు. తీరాచూస్తే వాళ్ళకు మరో ప్రపంచంలో బిజీ పెరిగినపుడు మనతో దూరం జరుగుతారు. ఇది తెలిసికూడా దగ్గరై.. మళ్ళీ దూరమై.. ఇదంతా అలవాటు పడేందుకు సమయం పడుతుంది. కానీ తప్పక అలవాటు పడతాం. ఇంటి నిండా జనాలు అలవాటైనవాళ్ళు, పల్లెటూరి వాసనతో గడిపేవారు, అమ్మతిట్లు, టీచర్ అరాచకం, స్నేహితుల అల్లరి, ప్రియురాలి ముచ్చట్లు ఇవన్నీ దూరమైతే కాస్త కాదు చాలా వెలితే మిగులుతుంది. కానీ రద్దీ జీవితంలో పడి కాలం గడిచే కొద్దీ మళ్ళీ కొత్త ప్రపంచానికి బదిలీ అవుతూ ఉంటాం. నిరంతరంగా జరిగే ఈ ప్రక్రియకు అంతులేదు. మార్పు సహజమని నమ్మేందుకు పెద్దగా సమయం తీసుకోని రోజులు కూడా ఎదురవుతాయి.

మారిపోవడం ఒక్కోసారి బావుంటుంది కానీ.. ఒక్కోసారి వెలితిగానే ఉంటుంది. ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ తరుముతూనే ఉంటుంది. నా వరకూ నాకు కొత్తకు అలవాటు పడటం, పాత గురించి బెంగపడటం అలవాటు కాకపోవడం ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. మరి మీకో...

Wednesday 27 March 2024

ఈ ఖాళీలను పూరింపుము..!!


శ్రీశాంతి.. 28-3-2024


ఖాళీతనం ఒక్కోసారి మరీ ఇబ్బంది పెట్టేస్తుంది. అది బుర్రలో పుట్టి, ఆలోచనను కూడా ఖాళీ చేసి ఏదీ తోచకుండా చేసిపారేస్తుంది. కొన్ని ఖాళీలను పరిస్థితులు సృష్టించి పారేస్తే.. మరికొన్ని మనమే సృష్టించుకుంటూ ఉంటాం. ఈ ఖాళీలో నింపేయడానికి ఏదీ సరిపోదు. నిండుగా వాకిలంతా అలుముకున్న చెట్టు నేలకూలిపోతే ఏర్పడే ఖాళీలాంటిది. ఇంటి పెద్ద మాయం అయిపోతే కలిగే ఖాళీ.. నచ్చిన మనిషి దూరం అయితే కలిగే ఖాళీ.. మనసుకు ఇలాంటి ఖాళీలు అలవాటు కావు కనుక ఇబ్బందిలో, ఉక్కిరి బిక్కిరిలో ఏదీ తోచక ఏర్పడే ఖాళీ..


ఏం చేయాలో తెలిసి కూడా చేయలేకపోవడం, చేయాలనన్నా మనసుకు రాకపోవడం, నిజానికి ప్రతి ఒక్కరికీ ఎదురవుతూనే ఉంటుంది ఇలాంటి పరిస్థితి. కాకపోతే ఆ ఖాళీని పూరించడం మాత్రం అంత సులువైన పనికాదు. రాయాలనుకున్న విషయం గురించి ఏదో ఆలోచన మొదలైనా రాయలేని ఇబ్బందిలాంటిదే ఇదీనూ..


నేను అప్పుడప్పుడూ ఏదో రాసేయాలని కూర్చుంటాను. చాలా అంటే చాలా సీరియస్గా.. కానీ తీరా కూర్చున్నాకా ఏదీ తట్టదు. అప్పటి వరకూ బుర్రను పట్టుకుని కుదిపేసిన ఆలోచనలు.. ఒక్కసారే రెక్కులు తొడుక్కుని ఎగిరిపోతాయి. ఇంకేముందీ.. ఇంతక మునుపు ఉన్న ఖాళీకన్నా ఇప్పుడు ఇంకాస్త పెరిగి కనిపిస్తుంది.. బుర్రలో ఖాళీ..


నిన్న ఉన్న విశాలమైన ఆలోచనలు,, ఆత్రం ఈరోజు లేనట్టే.. రాయాలనుకునే విషయాన్ని తక్షణమే రాయలేకపోతే ఏదో వెలితిలోకి పోతుంది. మనసుకు చాలా అలవాటు కావాలి. బంధాలనుంచి దూరంగా తప్పుకుని ఒంటరి జీవితంలో ఉన్నప్పుడు మాత్రమే కొన్ని తెలిసి వస్తాయి. అదెలాగంటే.. ఆకు నిండా ఉన్న పదార్థాలను తినలేని పరిస్థితికన్నా,, తినడానికి ఆ పూటకి దొరికిన పప్పే, పరమాన్నం అనుకుని తినేయగలిగే తృప్తి ఉంది చూడండి అలాంటి పరిస్థితి ఉంటేనే బ్రతకు బరువు తెలుస్తుంది. 


అలా ప్రతి ఖాళీనీ పూరించుకుంటూ వస్తే.. చివరి మజిలీ కాస్త భయపెట్టేదే అయినా అలవాటు పడిపోతాం. ముసలితనం ఈ మధ్య భయపెడుతుంది నన్ను.. ఆ వయసుకు వస్తే.. నేను ఎలా ఉంటానో.. రూపంలో కాదు.. ఆరోగ్యపరంగా నా పరిస్థితి ఏంటీ అని తెగ కంగారుగా ఉంటుంది. కానీ మళ్లీ తమాయించుకుంటాను. ఖాళీలను పూరిస్తూ వస్తున్న నేను ఈ ఖాళీని కూడా పూరించుకుంటూ పోగలను అని నా విశ్వాసం. మీకూ ఇలాంటి భయాలే ఉండి ఉండచ్చు.. కానీ నాలా చెప్పుకోరు అంతే.. నిజమేనా..?

Friday 22 March 2024

వైరాగ్యానికి అటు ఇటు..


శ్రీశాంతి.. 23-3-2024

కంఫర్ట్ దీనిని ప్రతి ఒక్కరూ ఆశిస్తూనే ఉంటారు. జీవితంలో ఎన్ని చేసినా కూడా అవన్నీ కంఫర్ట్ కోసమే.. ఎన్ని కష్టాలు పడినా కూడా సౌకర్యం కోసమే.. లేకపోతే ఎందుకీ పాడు బతుకు అనిపిస్తుంది. నిజానికి ఎక్కడెక్కడ తిరిగినా రోజులో ఎక్కడ తిరిగి వచ్చినా, కూడా ఇంటికి చేరే సరికి కలిగే ఆనందం వేరు. నా వరకూ నాకు మెట్లెక్కి నా ఇంటి గుమ్మం ముందుకు చేరుకోగానే.. ఓ పాజిటివ్ నెస్ కనిపిస్తుంది. కొత్త ప్రదేశంలో ఎన్ని సౌకర్యాలు ఉన్నా కూడా మన ఇంటి మంచం మీద పడుకున్నప్పుడు పట్టే నిద్రే నిద్ర. 

హాల్లో చిన్న బొంత మీద కూర్చున్నా అదే ఆనందం. చుట్టూ మనం నాటుకున్న మొక్కల మధ్యలో కాసేపు నిలబడినా,  నచ్చిన పాట వింటూ సమయం గడిపినా ఎక్కడ దొరుకుతుంది ఇలాంటి ఆనందం. 

ఇక తిండి విషయానికి వస్తే.. నాలుకకు కొత్త రుచులు కావాలి. రోజులో ఎంత చెత్త తినాలన్నా కూడా అది ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. తిండి విషయంలో ఒకప్పుడు ఉన్న చాపల్యం ఇప్పుడు తగ్గిందనిపిస్తుంది. ఏదో తినేయాలన్న ఆత్రం తప్పితే చక్కగా అన్ని కూరగాయలూ వేసుకుని పెట్టుకున్న దప్పళం ముందు ఈ పిచ్చి తిళ్ళు ఏం బావున్నాయనిపిస్తుంది. పులిహోరను కొట్టే వంటకం మరొకటి ఉందా అనిపిస్తుంది. ఏంటో రోజు రోజుకూ నేను చేసుకుతినే వంటకాలు తప్పితే బయటివి నచ్చడం లేదు. అలా అని ఇప్పుడే సన్యాసం పుచ్చుకోవాలనీ లేదు.. మరీ తిండి మీద యావ చంపేసుకు బతికేస్తే ఇక గొడ్డుకి మనిషికీ తేడా ఏముంది. 

కాకపోతే ఆరోగ్యం మీద కాస్త శ్రద్ధ పెరిగింది. రేపు నేను ఎలా ఉండబోతున్నానో అనే ఆలోచన రాగానే వెంటనే తినాలనే యావ చచ్చిపోతుంది. కాలాన్ని గిర గిర తిప్పే పని పెట్టుకున్న మహానుభావుడు ఎవరో గానీ.. కనిపిస్తే కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకోవాలనిపిస్తుంది. ఎందుకు త్వరత్వరగా కాలాన్ని జరుపుకుంటూ పోతున్నాడో ఏమో.. ఒక్కోరోజూ మారుతున్న కొద్దీ ఒక్కో రకమైన ఆలోచన కలుగుతుంది. 

నిన్నటిలా నేడు ఉండదు. నేటిలా మరో రోజు మారదు. కాకపోతే ఉన్న క్షణాలను అందంగా మలుచుకోవడమే జీవితం. ఏంటో నాకు కొత్తగా వైరాగ్యం కూడా అంటుకుంటుంది ఈ మధ్య. వయసుదాటిన ఎవరిని చూసినా నా రాబోయే రోజులు గుర్తుకు వస్తున్నాయి. మనసంతా బాధగా ఉంటుంది. మరీ ఎక్కువ ఆలోచించేస్తున్నాననిపిస్తుంది. కానీ.. ఇదంతా చక్రం.. జీవన చక్రం.. అందులో వద్దన్నా జరిగే మార్పులు అంతే.. సర్దుకోవాలి.. నిజాన్ని అంగీకరించాల్సిందే.. నిజమే కదా.

Thursday 21 March 2024

హృదయం నిండా.. పూల వాసనలే.. !


Sri santhi 22-3-2024

అందమంతా ప్రకృతిదే అయితే అది చూసి మురిసిపోయే నా జన్మ ధన్యం. ఈ చూసే కళ్ళకు కనిపించేదంతా అందమే.. ఈ భూమిమీద ఈ జీవితంలో నేను అనే మనిషిని అన్ని వాసనలను, అందాలను, సౌందర్యాన్నీ, కష్టాన్ని, సుఖాన్ని అనుభవించగలుగుతున్నానంటే అది నిజంగా దేవుడి దయే.. 


సరే అందం అనుకున్నాం కదా.. నేను ఆగి మరీ చూసే అందం మొక్కలది. పూలది.. వాటి సువాసనలది.. సన్నజాబులు, మల్లెలు, పారిజాతాలు, చామంతులు, గులాబీలు ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడు పూలు, బోలెడు అందాలు, అందమైన ముఖాలకన్నా పూలను చూసినప్పుడు కలిగే ఆనందం వేరు. వాటి వెనుక నేను ఆలోచించే, మురిసిపోయే క్షణాల ఆనందం మరింత గొప్పది.. నిజానికి మొక్కలంటే నాకు ఎందుకు ఇష్టమో చెప్పాలంటే బాల్యం వైపుకు చూడాలి. ఎందుకో మొక్కలు మాట్లాడతాయి అనిపిస్తుంది. చక్కని పూలతో రకరకాలుగా వాటికి తగినట్టుగా నవ్వుతాయి. ఆ నవ్వులో నాకు ఓ ఆత్మీయత కనిపిస్తుంది. నాకు మొక్కలను చూడగానే పూనకం వస్తుందని ఇంట్లో అంటారు కానీ .. మొక్కలను కొని తెచ్చి ఇంట్లో పెట్టి పెంచడం అంటే వాటికి కొత్త వాతవరణాన్ని పరిచయం చేయడం లాంటిదే.. 


కానీ ఏమాటకామాట.. అందంగా పెంచుకున్న మొక్కకు ఓ పువ్వు పూసిందనుకోండి. ఎంత ఆనందమో కదా.. భలే అనిపిస్తుంది. నాకైతే సంబరమే.. మొన్నామధ్య మా దగ్గరలో సింహాచలం సంపెంగ మొక్కను చూసాను. కాస్త రేటు ఎక్కువే చెప్పాడు. రెండు రోజులు తిరిగి మొత్తానికి మొక్కను అతి  కష్టం మీద మా బాల్కనీలోకి తెచ్చాను. దానికి ఇంకా మొగ్గలు రాలేదు. ఫిబ్రవరి 13న కొంటే మార్చి 20న పువ్వు పూసింది. ఇక నా సంబరానికి అవధులు లేవంటే నమ్మండి. బయట ఈ పువ్వులు దొరకడం కష్టం.. ఒకవేళ దొరికినా పువ్వు 20 రూపాయలు అమ్ముతున్నారు. ఎందుకో ఇది పూసాకా కోయబద్ది కాయలేదు. ముసిపోయాను అలా చూసుకుంటూ.. మీకూ ఈ పువ్వు ఇష్టమేనా..


ఒకప్పుడు మొక్కలు కొనితెచ్చి వాటిని పెంచి, చూసి మురిసిపోయి.. ఇలా ఉండేది. ఇప్పుడు సమయం కుదరడం లేదు.. పైగా ఇల్లు ఇరుకుగా ఉండటం కూడా మొక్కల మీద మక్కువను చంపేస్తుంది. ఓ కార్నర్‌లో పెట్టి పెంచుకోవాలి తప్పితే పెద్దగా వేరే మార్గంలేదు,. పాపం వాటిని ఇలా బంధించి పెంచడం ఇష్టలేక వదిలేస్తున్నాను. కాకపోతే ఎటన్నా పోతున్నప్పుడు మొక్కలవాడు కనిపిస్తే మాత్రం బుట్టలో మొక్కల్ని చూసి మురిసిపోవడమే.. ఏంటో బాధగా ఉంటుంది. అయ్యో వీటిని తీసుకుని వెళ్ళలేకపోతున్నానే అని. మనసులో మాత్రం గట్టిగా అనుకుంటాను. ఎందుకు నేను ఇంట్లో ఉండే సమయం తక్కువ కదా.. ఆదివారాలు తప్పితే కదరదు కదా.. అలాంటప్పుడు వీటిని పెంచే బాధ్యత మీద వేసుకోవడం.. ఇంట్లో చివాట్లు తినడం అవసరమా..అని.


అవును.. చివాట్లంటే గుర్తుకు వచ్చింది. మీ ఇంట్లో కూడా ఇలానే తిడతారా.. వీధిలో కనిపించిన ప్రతి మొక్కనూ ఎత్తుకొస్తావు,. వాటిని తెచ్చాకా చూసే నాధుడు ఎవరు. డబ్బులన్నీ తగలేస్తున్నావని. మొక్కలు కాళ్లకి అడ్డంగా ఉన్నాయని.. ఇల్లు మారేప్పుడు ఎవరు ఎత్తుకెళతారు అంత బరువైన కుండీలని.. ఇలా ఆ క్షణానికి తగిన విధంగా.. గుర్తుకు వచ్చిన తిట్లన్నీ తిట్టి పోయడం లాంటివి ఏమైనా ఉంటాయా.. ఉండే ఉంటాయి. కదా..

పొడిబారిన ముద్దు..

కొన్నాళ్ళుగా నీ ముద్దు పెదవుల్ని అంటడం లేదు.. తడారిపోయింది చప్పగా.. జీవం లేనట్లుగా.. మారిపోతుంది నిజం నుంచి జ్ఞాపకంలా ఈ ముద్దే తరుముతోంది పె...